ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనే రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. సీఎస్ శాంతికుమారి అందించిన దస్త్రాలపై ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆయన తొలి సంతకాన్ని చేశారు. గతంలో గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని కలిసి దివ్యాంగురాలైన తాను కష్టపడి పోస్టు గ్రాడ్యేషన్ పూర్తి చేశానని, కానీ తనకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ఆయన నాంపల్లి నియోజక వర్గానికి చెందిన బోయిగూడకు చెందిన ఆమెకు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. నేడు వేదిక పైనే ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.


