రాహుల్ తిట్టేవాళ్ళతోనే రేవంత్ వ్యాపారం చేస్తుంటాడు
గౌతం ఆదాని, ఆయన మేనల్లుడు సాగర్ ఆదాని సహా మొత్తం 8 మందిపై అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసులు నమోదైన నేపథ్యంలో మాజీ మంత్రి కేటిఆర్ శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదాని కుటుంబీకులను అరెస్ట్ చేయాలని,వాళ్లని జైళ్లకి పంపాలని నిత్యం రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటాడు కదా…మరి అలాంటి ఆదానితో చేతులు కలిపిన తెలంగాణా సీఎం రేవంత్ ని ఎన్నిసార్లు జైలుకి పంపాలో చెప్పాలని రాహుల్ గాంధీని కేటిఆర్ సూటిగా ప్రశ్నించారు.గతంలో 4గంటలకు పైగా ఆదానీ ప్రతినిధులు చర్చలు జరిపారని,దీనిపై లోతైన విచారణ జరగాలని ఆయన కోరారు.తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని,అలాంటిది రాహుల్ గాంధీకి తెలియకుండానే రేవంత్ రెడ్డి…ఆదానీలతో చర్చలు జరిపారా అని నిలదీశారు. కోహినూర్ హోటల్‌లో ఆదాని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రహస్య భేటీ ఎందుకు జరిగిందో రాహుల్ సమాధానం చెప్పాలన్నారు.

