Andhra PradeshHome Page Slider

తిరుమల కాలినడక మార్గంలో ఆంక్షలు

15 ఏళ్ల లోపు వారికి మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతి
చిన్నారుల చేతికి ట్యాగ్ ..అందులో వారి పూర్తి వివరాలు
తిరుమల శేషాచలం అడవుల్లో పెరిగిన పులుల సంచారం
రెండో ఘాట్ రోడ్‎లో సాయంత్రం 6- ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకల నిలుపుదల

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన సంఘటనతో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాలినడక మార్గంలో ఆంక్షలు విధించింది. 15 సంవత్సరాల లోపు చిన్నారులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతించాలని నిర్ణయించింది. ప్రతి బాల బాలికలకు వారి పేరు తల్లిదండ్రుల వివరాలు ఫోన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ తో కూడిన ట్యాగ్ ను చేతికి పెట్టాలని నిర్ణయించింది. ఒకవేళ వారు తప్పిపోయిన గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. కాగా తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగిందని గుర్తించారు. ఒకటి ,రెండు కాదని ఒక్క శనివారం నాడు ఐదు ప్రాంతాల్లో వేరువేరు చిరుతలు సంచరించడం చూసామని అటవీ సిబ్బంది చెప్పడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శ్రీవారి మెట్టు, అలిపిరి కాలి నడక బాటలో కొండకు నడిచి వెళ్లే భక్తులకు గట్టి ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని గుంపులు గుంపులుగా వెళ్లాలని వెళ్లే సమయంలో శబ్దం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రెండో ఘాట్ రోడ్ లో సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.