జగన్ క్లాస్‌తో ఇద్దరు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుల రాజీనామా
◆ మరికొన్ని జిల్లాల్లో అసంతృప్తితో ఉన్న జిల్లా అధ్యక్షులు
◆ గడపగడప కార్యక్రమంతో ఒత్తిడి
◆ గుంటూరు, అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షు పదవులకు రాజీనామా
◆ సుచరితపై సీఎం జగన్ పూర్తి అసంతృప్తి
ఏపీలో మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకోండి వేరే వాళ్లను చూసుకుంటా అంటూ క్లాస్ కూడా తీసుకున్నారు. దీంతో పలువురు జిల్లా అధ్యక్షులు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.

జగన్ క్లాస్ తీసుకున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత, అనంతపురం జిల్లా అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి తాజాగా అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. కానీ అధ్యక్షులకు పంపించిన లేఖలో మాత్రం తాము నియోజకవర్గాల పరిమితమవుతామని చెప్పిన అంతర్గతంగా నెలకొన్న అనేక సమస్యలు గడపగడపకు కార్యక్రమంతో పెరుగుతున్న ఒత్తిడితోనే వారు రాజీనామాలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు. పేరుకే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నామని తమకు తెలియకుండానే జిల్లాలో అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయని ఒకింత ఆ పార్టీకి చెందిన కొంతమంది అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

ఎంత కష్టపడినా చివరికి పార్టీ అధినేత వద్ద మాట పడటం కంటే గౌరవంగా తప్పుకోవడమే మంచిదన్న ఆలోచనలతో రాజీనామాలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏమైనాప్పటికీ నాలుగు రోజుల లోనే ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి జిల్లాలపై ఫోకస్ పెట్టడం నిత్యం సమీక్షలు నిర్వహించడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కత్తి మీద సాములా మారాయని ఆ పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉండి పార్టీ జిల్లా అధ్యక్షులు బాధ్యతలు నిర్వహించడం తమ వల్ల కావడం లేదని నియోజకవర్గాలకే పరిమితమవుతామంటూ సుచరిత, కాపు రామచంద్రారెడ్డిలు రాజీనామాలు చేశారు. అనంతపురం జిల్లాలో కీలక నేత అయిన కాపు రామచంద్రారెడ్డి తనకు కుటుంబంలో ఇటీవల జరిగిన విషాదం వల్ల జిల్లా స్థాయి కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నానని అలానే రాయదుర్గం నియోజకవర్గం పై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నందున పార్టీ జిల్లా అధ్యక్షులుగా వేరే వారిని నియమించాలని కోరుతూ పార్టీ అధినేతకు లేఖ రాయగా ఆయన రాజీనామాను జగన్ ఆమోదించారు.

అలానే గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ హోం మత్రి మేకతోటి సుచరిత నాలుగు రోజుల క్రితమే రాజీనామా చేశారు. తాను కూడా తన నియోజకవర్గమైన ప్రత్తిపాడుకు మాత్రమే పరిమితం అవుతానని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో తనను పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆమె సన్నిహితులు వద్ద వాపోయినట్లు సమాచారం. గతంలో హోం మంత్రిగా పనిచేసిన సుచరితకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. తనతో పాటు పనిచేసిన తానేటి వనితకు తిరిగి మంత్రి పదవి ఇచ్చి తనను విస్మరించడంపై అప్పట్లో సుచరిత అలకపూనటంతో స్వయంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడి సర్దుబాటు చేశారు. కీలకమైన జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పజెప్పారు.

మంత్రి పదవి దక్కక పోవడంతో అప్పట్లో రాజీనామాకు సిద్ధపడి పార్టీ అధిష్టానంపై వ్యతిరేకతను ప్రదర్శించటంతో ఆమెను తాడేపల్లి కార్యాలయానికి పిలిపించుకొని సున్నితంగా మందలించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా జిల్లా అధ్యక్ష పదవి నుండి సుచరిత తప్పుకోవటంపై సీఎం జగన్ ఆమెపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కే అవకాశం లేదని గుంటూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉన్న వైసీపీకి ఇద్దరు జిల్లా అధ్యక్షుల పదవి నుండి తప్పుకోవటంతో అధిష్టానం కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ రెండు జిల్లాలకు త్వరలోనే బలమైన నాయకులను అధ్యక్షులుగా నియమించడానికి జగన్ కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.