Andhra PradeshHome Page Slider

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడనేది మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. మరో సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారని చంద్రబాబు తరఫు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.