కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ.. యడ్యూరప్ప ఇళ్లు ముట్టడి
ఎస్సీ రిజర్వేషన్లలో అంతర్గత విభజను వ్యతిరేకిస్తూ… కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బంజారా కులస్తులు శివమొగ్గలోని బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప ఇళ్లు ముట్టడికి ప్రయత్నించారు. మధ్యాహ్నం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో బీఎస్ యడియూరప్ప ఇంటి వెలుపల భారీ ప్రదర్శన చేశారు. కొందరు రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బంజారా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది నిరసనకారులపై లాఠీ చార్జ్‌కి కారణంగా గాయపడ్డారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఆందోళనచేపట్టారు. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను కొత్తగా మార్పులు చేయాలని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది.
ఎస్సీ కులాలకు అందిస్తున్న 17 శాతం రిజర్వేషన్లను జనాభాను బట్టి విభజించింది. ఐతే తమ కులానికి తక్కువ రిజర్వేషన్లు కల్పించారని ఆరోపిస్తూ బంజారా కులస్తులు ఆందోళనకు దిగారు. కేవలం 4.5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం దారుణమని వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఆవశ్యకతను పరిశీలించేందుకు 2005లో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ఏర్పాటు చేసిన ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కారు చెబుతోంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా సంఘం నాయకులు ఆరోపిస్తూ… కేంద్రానికి చేసిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.