‘పడిలేచిన బంతిలా’ అదానీ గ్రూప్ వేలకోట్ల రుణాల చెల్లింపు
ఏదైనా సంస్థ అయినా, వ్యక్తికైనా మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కష్టం. కానీ చెడ్డపేరు ఒక్కక్షణంలో వస్తుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వదంతులు కూడా కారణం కావచ్చు. వైభవంగా వెలిగిపోతున్న అదానీ గ్రూప్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. ఇటీవల హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కంపెనీల షేర్లు పతనావస్థకు చేరుకోవడంతో లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేవలం కొద్ది రోజుల కాలంలోనే ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవస్థానం నుండి అదాటున 30 వస్థానానికి గౌతమ్ అదానీ పడిపోయారు. కానీ వెంటనే తేరుకుని సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపే ప్రయత్నాలు చేస్తోంది. క్రిందపడిన బంతి రెట్టింపు వేగంతో పైకిలేచినట్లు ఈ సంస్థను తిరిగి ఉన్నతికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

2025 వరకూ గడువు ఉన్నప్పటికీ షేర్ల తనఖా పెట్టి తెచ్చిన 7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించినట్లుగా ప్రకటించింది. రుణభారాన్ని తగ్గించుకుంటామని ప్రమోటర్లకు హామీ ఇచ్చినట్లు తెలిపింది. వీటిని పలు అంతర్జాతీయ బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలకు చెల్లింపులు చేసినట్లు తెలిపింది.
అదానీ సంస్థల షేర్ల విలువ తగ్గిపోవడం వల్ల నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బాంబే స్టాక్ ఎక్సేంజ్ వీటిపై అదనపు నిఘా ఏర్పాటు చేసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వంటి సంస్థలు ఈ అడిషనల్ సర్వైలెన్స్ మెజర్( ASM) నిఘాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ చెల్లింపులు జరగడంతో అదానీ ఎంటర్ ప్రైజెస్‌ను ఈ నిఘా నుండి తొలగిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. ఇది మార్చి 8 నుండి అమల్లోకి రాబోతోంది.

అంబుజా సిమెంట్స్‌ను, పోర్ట్స్ అండ్ సెజ్‌ను గత ఫిబ్రవరిలోనే ఈ నిఘా నుండి తొలగించింది. ఇప్పుడు అదానీ ఎంటర్ ప్రైజెస్‌కు కూడా వెసులుబాటు కలిగింది. ASM పరిధిలోకి వెళ్లిన షేరులో ట్రేడింగ్ చేయాలంటే.. ముందస్తుగా 100 శాతం మార్జిన్ అవసరం అవుతుంది. షేరు ధరల్లో తేడాలు, క్లయింట్ కాన్సెంట్రేషన్, మార్కెట్ విలువ, లావాదేవీల సంఖ్యలో తేడాలు వంటివి ఈ పరిధిలోకి వెళ్లడానికి కీలక ప్రమాణంగా ఉంటుంది. ఈ పరిధిలోకి వచ్చిన షేర్ల కొనుగోలు, అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయి. ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే ముప్పు అని భావించి పెట్టుబడులు పెట్టడానికి మదుపర్లు ముందుకు రారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది అదానీ గ్రూప్.