రేణుకా చౌదరి జాక్ పాట్, తెలంగాణ నుంచి రాజ్యసభకు
కాంగ్రెస్ ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశమున్న రెండు స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రేణుకతోపాటుగా, అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఖరారు చేసింది. అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. దీనికి సంబంధించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో తెలంగాణ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. ఇక కర్నాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నజీర్ హు్ససేన్, జీసీ చంద్రశేఖర్ కు పార్టీ అవకాశమిచ్చింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్ సింగ్‌కు రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.


