వైఎస్ జగన్‌కు సరస్వతీ షేర్ కేసులో ఊరట
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్‌ల బదిలీ వ్యవహారంలో భారీ ఊరట లభించింది. ఈ షేర్ బదిలీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్‌టీ), హైదరాబాద్ బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షేర్‌లను అక్రమంగా బదిలీ చేశారంటూ గతేడాది సెప్టెంబర్‌లో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యుల పేర్ల నుంచి సరస్వతీ పవర్‌లోని షేర్‌లు మోసపూరితంగా బదిలీ చేసినట్లు ఆరోపిస్తూ, వాటిని నిలిపివేసి, అసలు వాటాదారుల పేర్లు తిరిగి నమోదు చేయాలని కోరారు.జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ‘గిఫ్ట్ డీడ్ పూర్తికాకముందే షేర్‌ల బదిలీ జరిగింది. అవసరమైన పత్రాలు లేకుండానే కంపెనీ షేర్‌లను బదిలీ చేసింది’ అని న్యాయస్థానానికి తెలిపారు. పిటిషన్‌పై దాదాపు పది నెలలపాటు విచారణ జరిగిన తర్వాత, ఎన్సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్ మరియు సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ తుది తీర్పును ఇవాళ వెల్లడించారు. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉన్న తరుణంలో షేర్ బదిలీలు సాధ్యం కావు అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

