HealthHome Page SliderNational

పగటిపూట కాస్త రీఛార్జ్ అవుతున్నారా…

కొందరికి పగటిపూట కూడా కాస్త కునుకు అలవాటు ఉంటుంది. దీనివల్ల బాడీ రీఛార్జ్ అవుతుందని వైద్యులు చెప్తున్నారు. ఇదేమీ సోమరితనం కాదని ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మానవ మెదడు పునరుత్తేజం పొందడానికి రాత్రి ఆరేడు గంటల నిద్రతో పాటు, పగటి పూట ఒక 20 నిమిషాల కునుకు ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది పిల్లలకు కూడా చాలా అవసరం అని, దీనివల్ల వారు నేర్చుకున్న విషయాలను బాగా గుర్తు పెట్టుకోగలుగుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి కునుకు వల్ల పిల్లలకు, పెద్దలకు కూడా చాలా మంచి జరుగుతుంది. హుషారు కలిగించి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మతి మరపు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ కునుకు సమయం మధ్యాహ్నకాలంలో ఒంటిగంట నుండి 4 గంటలలోపు ఉంటే చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కానీ కునుకు సమయం 20 నిమిషాల నుండి 40 నిమిషాలు ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిది కాదు. మరీ 4 గంటల తర్వాత నిద్రపోతే రాత్రినిద్రకు ఆటంకం కలుగవచ్చు. అంతేకాక మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం కూడా మంచిది కాదు.