చైనాలో తిరుగుబాటు..? జిన్‌పింగ్ గృహ నిర్బంధం..?
చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందా..? ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేశారా..? ‘కో-ఆపరేషన్ సదస్సు నుంచి తిరిగొచ్చిన జిన్‌పింగ్‌ను సైన్యం విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. చైనా సైన్యం బీజింగ్ వైపు కదులుతోంది’ అమెరికాలో నివసిస్తున్న చైనా మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జెంగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని 60 శాతం విమానాలు శుక్రవారం అకస్మాత్తుగా నిలిచిపోయాయి.

నిలిచిపోయిన విమానాలు.. బీజింగ్ వైపు సైనిక వాహనాలు..
తమ దేశంలో 59 శాతం విమానాలు నిలిచిపోయాయని.. వెంటనే సైనిక వాహనాలు బీజింగ్ వైపు కదిలాయని చైనా రచయిత గోర్డాన్ చాంగ్ కూడా ట్వీట్ చేశారు. సీనియర్ అధికారులను జైల్లో పెట్టారని.. అక్కడ భారీ ఎత్తున పొగ కమ్ముకుందని.. చైనా కమ్యూనిస్టు పార్టీలో, చైనాలో అస్థిరత నెలకొందనే అనుమానాలు తలెత్తాయని గోర్డాన్ పేర్కొన్నారు. గోర్డాన్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే నివసిస్తుండటం విశేషం. జిన్‌పింగ్ స్థానంలో పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ జనరల్ ఖియావోమింగ్ దేశాధ్యక్షుడిగా నియమితులయ్యారని ప్రచారం జరుగుతోంది.

ప్రధాన మీడియాలో లేని వార్త..
చైనాలో జిన్‌పింగ్‌ను తప్పించారనే వదంతులు ప్రచారంలో ఉన్నాయంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా ట్వీట్ చేయడం విశేషం. అయితే.. సీఎన్‌ఎన్, బీబీసీ వంటి ప్రధాన మీడియా దీనిపై ఎలాంటి వార్తలను ప్రసారం చేయడం లేదు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్‌లోనూ ఎలాంటి కథనాలు లేవు. దీంతో ఈ వార్తలు వదంతులేనని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. వచ్చే నెలలో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సందర్భంగా తన అధికారాన్ని మరింత పదిలం చేసుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు. మరో ఐదేళ్లు.. లేదా అంతకంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.