వయనాడ్ వరద బాధితులకు రెబల్ స్టార్ ఆర్థిక సాయం
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వరదలు రావడంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారికి అండగా నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు వయనాడ్ బాధితులకు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్ల భారీ విరాళం అందించారు. ప్రకృతి విపత్తు కారణంగా అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. వారికి అందరూ తమవంతు సాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చాడు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ తదితరులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరారు.