Home Page SliderNational

ఆ వీడియో చేసినందుకు..క్షమాపణలు చెప్పిన రియల్ హీరో

సినిమాల్లో విలన్‌గా నటించి అందరిని మెప్పించారు సోనూసూద్. కానీ నిజజీవితంలో మాత్రం ఆయన మనసున్న గొప్ప హీరోగా పేరు సంపాదించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయం చేసి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. సోనుసూద్ ఇప్పటికీ వాటిని నిర్విరామంగా కొనసాగిస్తూ..ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో  షేర్ చేసిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆ వీడియోలో ఆయన రైలులో ప్రయాణించిన విధానమనే చెప్పాలి. ఈ వీడియోలో ఆయన రైలు డోర్ వద్ద ఫుట్‌బోర్డ్ ‌పై కూర్చొని కన్పించారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో  చూసిన వారిలో  కొందరు  ఆయన రైలులో ప్రయాణం చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఈ వీడియోపై నార్తన్ రైల్వే స్పందించింది. “సోనుసూద్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు. వారందరికి మీరు ఓ మంచి రోల్ మోడల్‌గా ఉన్నారు. అలాంటి మీరు రైలు డోర్ వద్ద కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని మర్చిపోయారా?” అని ప్రశ్నించింది. ఇటువంటి వీడియో షేర్ చేయడం వల్ల మీరు  అనేక మందికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నట్లే అని హెచ్చరించింది.

కాగా గత నెల 13వ తేదిన సోనూసూద్ ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఇప్పటికే ముంబయి పోలీసు కమిషనరేట్ దీనిని తప్పుబట్టింది.  నిజజీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి స్టంట్స్ చెయ్యొద్దని ఆయనకు సూచించింది. ఈ విధంగా ఈ వీడియోపై  విమర్శలు వెల్లువెత్తున్న వేళ ఆయన తాజాగా దీనికి  క్షమాపణలు తెలియజేశారు. “రైలు డోర్ వద్ద మగ్గిపోతున్న పేదల జీవితాలను అర్ధం చేసుకునేందుకే అక్కడ కూర్చున్నానని” ఆయన స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థ  తమ పనితీరును మెరుగుపర్చినందుకు ధన్యవాదాలు అని సోనూసూద్ ట్వీట్ చేశారు.