మునుగోడులో రియల్ ఫైట్
మునుగోడులో లెక్కలు వేసుకుంటున్న రెండు పార్టీలు
టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో మొదలైన టెన్షన్
కాంగ్రెస్ పార్టీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?
ఒక్క ఓటు కూడా నష్టపోరాదన్న భావనలో రెండు పార్టీలు
మునుగోడు ఉపఎన్నికకు మరో రెండు వారాలు మాత్రమే గడువుండటంతో అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. ఎన్నికల్లో గెలిచితీరాలని భావిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ ఉత్కంఠకు గురవుతున్నాయ్. రాజకీయంగా రెండు పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఎలాగైనా గెలిచితీరాలని భావిస్తున్నాయ్. గ్రౌండ్ సిచ్యువేషన్ అర్థం కాక తలలుపట్టుకుంటున్నాయ్. ర్యాలీలు, సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ ఓటరు అంతరంగం అర్థం కాక పార్టీల నేతలు కంగారుపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచి తీరాతామన్న విశ్వాసం మొన్నటి వరకు రెండు పార్టీల్లో ప్రబలంగా కన్పించినా.. ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఏదైనా తేడా వస్తే ఏమవుతోందనన్న బెంగ వారిని వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.

మునుగోడులో పెద్ద ఎత్తున బీసీ కులాల ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా యాదవులు, గౌడ్లు, పద్మశాలీలు ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న టెన్షన్ రెండు పార్టీల్లో గుబులు రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బంపర్ విక్టరీ సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో నియోజకవర్గ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయ్. గతంలో గెలిచిన విశ్వాసం ఉన్నప్పటికీ నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలవడం, ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో.. గతంలోలా ఓట్లు ఈసారి వస్తాయా రావా అన్న మీమాంశలో ఆయన కన్పిస్తున్నారు. గతంలో తనకు పూర్తి స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చాయ్. ఈసారి మునుగోడులో లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తుండటంతో, టీడీపీ మాత్రం రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డి ఓట్ల చీలిక ఏం చేస్తుందోనన్న బెంగలో ఉన్నారు.

ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎన్నికల్లో ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఈసారి గట్టి అభ్యర్ధిగా పార్టీ బరిలోకి దించింది. వాస్తవానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ పరిస్థితిల్లో మార్పు వస్తోన్నట్టు తాజా సర్వేలు చెబుతున్నాయ్. కూసుకుంట్ల, టీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గులాబీ పార్టీ నియోజకవర్గంలో బలంగా ఉన్నప్పటికీ.. కూసుకుంట్ల 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ప్రజలతో వ్యవహరించిన తీరును నేటికీ మరచిపోలేకపోతున్నారంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత కూసుకుంట్ల నియోజకవర్గంలో పార్టీ నేతలకు అందుబాటులో లేకుండాపోయారన్న అభిప్రాయం ఉంది. దీంతో కూసుకుంట్లకు టికెట్ ఇచ్చి తప్పు చేశామా అన్న భావనలో గులాబీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా బాగుండేదన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే పార్టీకి ఉన్న ఆదరణతో ఎన్నికల్లో సునాయాశంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ నేతలు భారీగా ఖర్చు పెడుతూ కార్యకర్తలను తమవైపునకు తిప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలం ప్రభావం చూపిస్తుందని… రెండు పార్టీలకు గట్టి పోటీ ఇస్తాన్న దీమాతో మొన్నటి వరకు ఉన్న స్రవంతి రెడ్డి పరిస్థితి తాజాగా అందుకు భిన్నంగా కన్పిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంత ప్రచారం చేసినప్పటికీ.. అటు టీఆర్ఎస్, బీజేపీ తరహాలో తమకు మైలేజ్ రావడం లేదన్న ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మొత్తంగా నియోజకర్గంలో గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతుంటే.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం హుజూరాబాద్ ఫలితం కలలోకి వస్తోందట. ఈ ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ రాజకీయాలు సంపూర్ణంగా మారిపోతాయన్న చర్చ కూడా పార్టీలో ఉంది.