హెరిటేజ్, ఇందాపూర్ పై ఆధారాలతో చర్చకు సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అధికార కూటమి, విపక్ష వైసీపీ సభ్యుల మధ్య రెండో రోజూ మాటల యుద్ధం కొనసాగింది. తిరుమల లడ్డూ కల్తీ అంశం, ఇందాపూర్ డెయిరీ వివాదాలపై ఇరుపక్షాలు పరస్పరం ధ్వజమెత్తడంతో సభ దద్దరిల్లింది.
మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం మాట్లాడుతూ, విపక్ష నేతలు దేవుడిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేది ‘సిట్’ విచారణలో వెల్లడైందని, అపచారం చేసిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని ఆమె స్పష్టం చేశారు.
హోంమంత్రి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శ్రీవారితో రాజకీయం చేస్తోంది ప్రభుత్వమేనని తిప్పికొట్టారు. సభ వాయిదా తర్వాత మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు. “ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ తేల్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ కుట్రలు,” అని బొత్స దుయ్యబట్టారు. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు. నెయ్యి ధరను రూ. 320 నుంచి రూ. 700 కి పెంచడం వెనుక పెద్ద దోపిడీ ఉందని, దీనికి చంద్రబాబు కుటుంబ ధనార్జనే కారణమని మండిపడ్డారు.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇందాపూర్, హెరిటేజ్ అంశాలపై సభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రైతుల గిట్టుబాటు ధరలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ నాయకుల సంపద పెంచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు.

