సామాన్యుడి నడ్డి విరిచిన ఆర్‌బీఐ
రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్
మరింత భారంగా బ్యాంకు రుణాలు
భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
తగ్గిన పారిశ్రామిక వృద్ధి సూచీ
డాలర్‌తో మరింత క్షీణించిన రూపాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుడి నడ్డి విరిచింది. శుక్రవారం ఉదయం జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక రెపో రేట్‌ను 0.50 శాతం పెంచి 5.90 శాతానికి చేర్చింది. ఈ రెపో రేట్ మే నెల నుంచి అమల్లోకి వస్తుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపో రేట్ అంటారు. రెపోరేట్ పెరగడంతో ప్రజలు తీసుకున్న వివిధ రుణాల వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వాహనాల లోన్స్‌పై నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది.

నెలవారీ బడ్జెట్‌పై భారం..
రెపో రేట్‌ను ఆర్‌బీఐ మే నెలలో 0.40 శాతం, ఆగస్టులో 0.50 శాతం, సెప్టెంబరులో 0.50 శాతం పెంచింది. అంటే 4 నెలల్లోనే 1.90 శాతం రెపో రేట్ పెరగడం విశేషం. ఫలితంగా బ్యాంకులు ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీ రేటుతో ఇచ్చిన రుణానికి ఇప్పుడు 8.5 శాతం కంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీంతో ఇల్లు, వాహనం, వ్యక్తిగత రుణాలపై మనం నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం లేదా రుణం చెల్లించే కాలం పెరుగుతుంది. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి లభించే రుణ పరిమితి కూడా తగ్గుతుంది. అంటే.. మార్జిన్ మనీ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్‌పై భారం పెరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. తగ్గిన పారిశ్రామికోత్పత్తి
గత మూడు నెలలుగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7 శాతానికి పెరగడం వల్లే వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. పారిశ్రామికోత్పత్తి వృద్ధి సూచీ 2.4 శాతానికే పరిమితం కావడం కూడా ఇబ్బందికరంగా మారిందన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా (రూ.81.94) క్షీణించడం మరో ప్రధాన కారణం అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందనే భయంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అమెరికా కూడా బాండ్లపై వడ్డీ రేట్లు పెంచడంతో డాలర్ విలువ భారీగా పెరిగింది. ఫలితంగా అన్ని దేశాల కరెన్సీలు పతనమయ్యాయి.

