బ్యాంకు రుణాలపై రిజర్వ్ బ్యాంకు కొత్త రూల్స్..
కొత్త సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు బ్యాంకులలో రుణాల మంజూరుకు సంబంధించిన కొత్త నిబంధనలు జనవరి 1 నుండి అమలులోకి తెచ్చింది. తమ రుణ చెల్లింపు సామర్థ్యానికి మించి రుణాలు చేసే వారికి ఇకమీదట రుణం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. రుణ గ్రహీతలు అధిక రుణాలు తీసుకోకుండా, వేర్వేరు బ్యాంకులలో తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాలు తీసుకోవడంపై కఠిన నిబంధనలు అమలు కాబోతున్నాయి. గతంలో బ్యాంకులు తమ రుణ రికార్డులను ప్రతీ నెల రోజులకొకసారి రిజర్వు బ్యాంకుకు నివేదించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు 15 రోజులకొకసారి నివేదించాల్సి ఉంటుంది. దీనితో తరచూ రికార్డులు అప్‌డేట్ చెయ్యాలి. అందుకే తనిఖీలు ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల ఒకేసారి పలు రుణాలు తీసుకోలేరు. నెలవారి ఈఎంఐలు, బకాయిల తిరిగి చెల్లింపులు, ఎగవేతలు వంటి సమాచారాన్ని కూడా ప్రతీ 15 రోజులకొకసారి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తాజా నిబంధనల వల్ల ప్రజలు అధిక రుణాలు తీసుకోకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.