బీజేపీకి రాపోలు గుడ్ బై.. టీఆర్‌ఎస్‌లోకి..!
మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన రాపోలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం వల్లే బీజేపీని వీడినట్లు చేనేత సంఘం నాయకుడు కూడా అయిన రాపోలు చెప్పారు. చేనేత రంగాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను నేతన్నలకు బీజేపీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పోతున్నానని చెప్పారు. అదే సందర్భంలో తెలంగాణాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను రాపోలు కొనియాడారు.

ఒకరు పోతే.. ముగ్గురు వచ్చారు..
2012-18 మధ్య కాలంలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన రాపోలు 2019లో బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం తనను ఎంతగానో అవమానించిందని.. జాతీయ స్థాయిలో తనకు ప్రాధాన్యత లేకుండా చేశారని.. అవమానాలను దిగమింగుకునే శక్తి తనకు లేదని.. అందుకే బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రాపోలు చెప్పారు. మొత్తానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీ లాక్కోవడంతో కేసీఆర్ ముగ్గురు బీజేపీ నాయకులను ఆ పార్టీ నుంచి లాక్కొని ప్రతీకారం తీర్చుకున్నారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.