Andhra PradeshHome Page Slider

బాబా ముసుగులో బాలికపై అత్యాచారం

బాబా ముసుగులో బాలికపై పైశాచికంగా ప్రవర్తించాడు పూర్ణానంద స్వామి. పైకి సాధువులా  ఆశ్రమంలో నివసిస్తూ, అక్కడ నివసించే 15 ఏళ్ల బాలికకు నరకం చూపెట్టాడు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో జ్ఞానానంద ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామిజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడంటూ ఒక బాలిక ఆరోపించింది. రాజమహేంద్రవరానికి చెందిన ఈ బాలిక తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే చనిపోయారు. దీనితో ఆమెను 5 వ తరగతి వరకూ చదివించిన బంధువులు రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెంలో ఉన్న ఈ ఆశ్రమంలో సేవలు, చదువు నిమిత్తం పంపించారు. దీనితో ఆబాలికతో పగలంతా ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులు చేయించిన స్వామీజీ, రాత్రుళ్లు తన నిజస్వరూపం బయటపెట్టాడు. అర్థరాత్రి ఆమెపై అత్యాచారం చేసేవాడు. గత ఏడాది నుండి కాళ్లకు గొలుసు బంధించి, ఎదురుతిరిగితే కొట్టేవాడు. కాస్త అన్నం మాత్రమే పెట్టేవారు. కాలకృత్యాలకు కూడా అనుమతించలేదని, చిత్రహింసలు పెట్టారని బాలిక తెలియజేసింది.

చివరకు ఈ నెల 13న పనిమనిషి సాయంతో ఆశ్రమం నుండి తప్పించుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కి తనకు పరిచయమైన మహిళకు తన కథంతా చెప్పింది.దీనితో ఆమె కృష్ణాజిల్లాలోని కంకిపాడులో హాస్టల్‌లో చేర్చేందుకు ప్రయత్నించింది. పోలీస్ స్టేషన్ నుండి లేఖ తీసుకురావాలని వారు కోరగా, కంకిపాడులోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ కథంతా వివరించారు. దీనితో వారు విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌కు వారిని పంపారు. దీనితో పూర్ణానంద స్వామిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఆసుపత్రిలో వైద్యపరీక్షల నిమిత్తం పంపారు. విశాఖలోని పోలీసులు ఈ స్వామీజీని అరెస్టు చేశారు. కాగా ఈ నెల 15న తమ ఆశ్రమంలో బాలిక అదృశ్యమయ్యిందంటూ వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు స్వామిజీ తమ ఆశ్రమ భూములు ఆక్రమించే కుట్రతోనే ఎవరో ఇదంతా చేస్తున్నారని, న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.