రన్యారావు అతనితో గొడవ వల్లే దొరికిపోయింది
బంగారు బిస్కట్లు అక్రమంగా దుబాయి నుండి తీసుకొస్తూ కన్నడ నటి రన్యారావు విమానాశ్రయంలో దొరికిన సంగతి తెలిసిందే. ప్రతీసారి పకడ్బందీగా తీసుకొచ్చే రన్యారావు ఒక కస్టమ్స్ అధికారితో పెట్టుకున్న గొడవ వల్లే దొరికిపోయిందని సమాచారం. గత ప్రయాణంలో తాను డీజీపీ కూతురిననే పొగరుతో ఒక కస్టమ్స్ అధికారితో గొడవ పడింది. దీనితో ఆమె రాకపోకల వివరాలను పరిశీలించాడు. ఆమె పలుమార్లు దుబాయికి వెళ్లి రావడమే కాకుండా ప్రతీసారీ ఒకే రకమైన దుస్తులు వేసుకున్న సంగతి కూడా కనిపెట్టాడు. అందుకే ఈసారి దుబాయి నుండి వచ్చేటప్పుడు పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహించి ఆమెను పట్టుకున్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఆమె కేవలం దుబాయి నుండి మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుండి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. ఆయా దేశాలకు ఆమె పలుమార్లు ప్రయాణాలు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తెలియజేశారు. రన్యారావు గతేడాది 30 సార్లు దుబాయికి వెళ్లారని, కేవలం 15 రోజులలో నాలుగుసార్లు ప్రతీ ట్రిప్‌లో కిలోల కొద్దీ బంగారాన్ని తీసుకువచ్చినట్లు తెలిసింది. దీనికోసం ప్రతీ ట్రిప్‌కు రూ.13 లక్షలకు తక్కువ కాకుండా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కేసు వెనుక ఒక ప్రముఖ రాజకీయనాయకుడి హస్తం ఉన్నట్లు కూడా మీడియాలలో వార్తలు వస్తున్నాయి. ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా పలుమార్లు దుబాయి వెళ్లడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

