Home Page SliderNational

మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేష్ బాయిస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం కీలకమైన రాజ్యాంగ నియామకాలు చేపట్టారు. భగత్ సింగ్ కోష్యారీ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ గవర్నర్ రమేష్ బాయిస్ నియమితులయ్యారు. రాష్ట్రపతి నిర్ణయాల్లో ఇది అత్యంత కీలకమైన రాజకీయ నిర్ణయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అత్యున్నత పదవి నుంచి తాను వైదొలగాలనుకుంటున్నట్లు కోష్యారీ గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. “గవర్నర్ కోష్యారీ తన జీవితాంతం చదవడం, రాయడం, విరామ కార్యక్రమాలలో గడపాలని కోరికను వ్యక్తం చేశారు” అని రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రిగా, పార్లమెంటు ఉభయ సభలలో ఎంపీగా పనిచేసిన RSS అనుభవజ్ఞుడైన కోష్యారీ 2019లో గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలంలో, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంతో ఘర్షణతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎన్నో వివాదాస్పద ప్రకటనలకు ఆయన కేంద్ర బిందువయ్యారు. వాస్తవానికి, ఆయన నియామకం జరిగిన వెంటనే, మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ… దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెల్లవారుజామున ప్రమాణ స్వీకారోత్సవం చేయడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఆ తర్వాత, కోవిడ్ మహమ్మారి తర్వాత దేవాలయాలను తిరిగి తెరవడం, కోష్యారీ డెహ్రాడూన్ పర్యటనకు రాష్ట్ర విమానాన్ని తిరస్కరించడంతో విభేదాలు నెలకొన్నాయి.