గురువు దమానీ చేతికి ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్‌లు
బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చాలా మంది పెట్టుబడిదారులకు మార్గదర్శకుడుగా, ఆదర్శంగా ఉన్నారు. 1986 లో స్టాక్ మార్కెట్లలో కేవలం రూ.5000తో అడుగు పెట్టి 2022 నాటికి 5 బినియన్ డాలర్లకు పైగా సంపాదించారు. ఆయన ఆగస్టు 4న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. పేరు, సంపాదన కొంతమంది వ్యక్తులకే సొంతం. అలాంటి వారిలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒకరు. ప్రస్తుతం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా షేర్ల విలువ రూ.30 వేల కోట్లు వరకు ఉండోచ్చని అంచనా. ఆయన ఆస్తి రూ.46,185 కోట్లు. ఇంతా సంపాదించిన ఆయన కామన్ మ్యాన్‌గా ఉండటానికే ఇష్టపడేవారు. తమ పిల్లలను కూడా ఆలానే పెంచేవారట. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తర్వాత, ఆయన మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో భారీ చర్చ జరిగింది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ఝున్‌ఝున్‌వాలకు నమ్మకమైన స్నేహితుడు, సలహాదారుడైన, డిమార్ట్ వ్యవస్థాపకుడైన రాధాకిషన్ దమానీ, ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ భాద్యతలను స్వీకరించనున్నారని సమాచారం.

ఝున్‌ఝున్‌వాలా ఎప్పుడూ ఆర్‌కే దమానీని తన గురువు అని కొనియాడారు. అనేక ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా తన తండ్రి టాటాస్, విన్‌స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ తన రోల్ మోడల్‌లు అని, వారి నుండి స్ఫూర్తి పొందానని గుర్తు చేసుకోనేవారు. ఆయన ప్రస్తుత పెట్టుబడులపై దమానీదే తుది నిర్ణయం కానుంది. మిగతా ట్రస్టీలుగా ఝున్‌ఝున్‌వాలాకు నమ్మకస్తులైన ఆయన స్నేహితులైన కల్పరాజ్ ధరమ్షి, అమల్ పారిఖ్ ఉంటారు. ఝున్‌ఝున్‌వాలా కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారట. అందుకని అయన అన్ని విషయాల గురించి ముందే ఒక ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖ కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమె ఆర్థిక విషయాలపై గొప్ప అవగాహన కలిగి ఉన్నారు. అంతేకాకుండా కంపెనీ నిర్వహణలో రేఖ సోదరుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఉత్పల్ సేథ్ మరియు అమిత్ గోలా కూడా నడుపుతున్నారు. ఝున్‌ఝున్‌వాలా షేర్లు టైటన్ లో రూ.10,946 కోట్లు, స్టార్ హెల్త్ లో రూ.7056 కోట్లు, మెట్రో బ్రాండ్స్ లో రూ.3166 కోట్లు, టాటా మోటార్స్ రూ.1707 కోట్లు, క్రిసిల్ రూ.1308 కోట్లలో ఉన్నాయి.