మళ్లీ వివాదంలో రాజాసింగ్- కేసు నమోదు
బీజేపి నుండి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మరోకేసులో ఇరుక్కున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా అఫ్జల్ గంజ్ పోలీసులు 153-ఏ సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కారణంగా ఈయనపై కేసు నమోదు అయ్యింది. కీర్తి కుమార్ అనే కానిస్టేబుల్ ఈ ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగాన్ని రికార్డు చేశాడు. ఈ ర్యాలీలో ఏనుగుపై ఊరేగుతూ శంకర్ షేర్ అనే హొటల్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిలో ఇద్దరు పిల్లలు అనే పాలసీ పాటించే వారికి మాత్రమే ఓటు హక్కు ఇస్తే హిందూదేశంగా భారత్ అవతరిస్తుందని వ్యాఖ్యానించాడు. అనంతరం ఒక మతాన్ని ఉద్దేశిస్తూ మేము ఐదుగురం మాకు ఏభై అనే పాలసీ ఉన్నవారికి ఓటు హక్కు ఉండరాదని పేర్కొన్నాడు. రాజాసింగ్ మాట్లాడుతూ.. మన రుషులు చెప్పినట్లు మన రాజధాని ఢిల్లీ కాదని ,కాశీ, మథుర, అయోధ్య వంటి వాటిని రాజధానిగా భావించాలన్నారు. దీనితో ఎస్సై వీరబాబు ఇచ్చిన కంప్లైంటుతో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

