8 ఏళ్ల పాలనలో ప్రజల బతుకులు ఏమీ మారలేదు
టీఆర్ఎస్ 8ఏళ్ల పాలనలో ప్రజల బతుకులు ఏమీ మారలేదని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంట్రాక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట లెక్క.. మిగితా నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల గురించి చట్టసభలో ప్రస్తావిద్దామంటే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారుడనే ముసుగులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని ధ్వజమెత్తాడు. కేసీఆర్ సంతలో గొర్రెలను కొన్నట్టు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పదవీ త్యాగం కాదు.. ప్రాణ త్యాగమైనా చేస్తానని అన్నారు. కేసీఆర్ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని.. టీఆర్ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని.. టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయాలన్నారు. కౌరవుల సేన తనను ఓడించడానికి వచ్చిందని.. ప్రజలు వారికి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

