పిడికిలి ఎత్తాలి.. ఆస్తులను కాపాడుకోవాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో బీజీ బీజీగా గడిపారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించి అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వైద్య కళాశాలకు చేరుకున్న కేసీఆర్ సొంత స్థలానికి భూమి పూజ చేశారు. ఈ పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్ జగిత్యాల కలెక్టర్ రవికి శాలువా కప్పి సీట్‌లో కూర్చోబెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అధికారుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అందుకే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అధికారులకు అత్యధిక జీతాలు ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

పండిన పంటను కొనే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వం నష్టం వచ్చినా కూడా సాగుకు సాయం చేసి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణనే అని కేసీఆర్ తెలిపారు. 2024 నాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నాము. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మరోసారి బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఉన్న ఆస్తులను ఊడగొడుతూ… ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. ఉచితాలు ఇవ్వకూడదంటారు.. కానీ ఎన్‌పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఆస్తులను బీజేపీ పార్టీ దోచి పెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌ఐసీని అమ్మేస్తామని అంటున్నారన్నారు. ప్రజల సొత్తును షావుకార్లకు కట్టబెడుతామంటే భారతదేశం పిడికిలి ఎత్తాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. 10 వేల మంది పెట్టుబడిదారులు దేశాన్ని వదిలిపెట్టి పోతున్నారన్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

