రేణిగుంట రహదారిపై అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే ఆమోదం
తిరుపతి: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB)కు అదనంగా రేణిగుంట వైపుకు యాక్సెస్ రోడ్డుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆమోదం లభించింది.
తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్ భారంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుత అండర్ బ్రిడ్జ్ నుంచి తిరుపతి వైపు మాత్రమే యాక్సెస్ ఉండటం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని ఎంపీ ముందుగానే గుర్తించారు.
దీంతో కాటన్ మిల్ గేట్ నంబర్ 108 వైపు కూడా యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేయాలని రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు.
ఎంపీ ప్రతిపాదనపై పరిశీలించిన రైల్వే శాఖ, అదనపు యాక్సెస్ రోడ్ ఏర్పాటు సాధ్యమని నిర్ణయించి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం అందించారు.
ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుండి మంగళం, లీలామహల్ సర్కిల్ వైపుకు వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

