కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందనడంతో పాటు అందులో పలు లోపాలున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్ర లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా- భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరుదేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.