Home Page SliderInternational

రాహుల్ అనర్హత వేటు.. లండన్‌లో భగ్గుమన్న నిరసనలు

రాహుల్ గాంధీపై పడిన అనర్హత వేటుతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం నిరసనలతో దేశాన్ని హోరెత్తిస్తున్నారు. మరోపక్క రాహుల్‌పై అనర్హత వేటు మన దేశంలోనే కాదు లండన్‌లో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది . కాగా రాహుల్‌పై పడిన అనర్హత  వేటును ఖండిస్తూ..లండన్‌లోని  పార్లమెంటు స్వ్యేర్ వద్ద కాంగ్రెస్ విదేశీ విభాగం నిరసన చేపట్టింది. రాహుల్‌పై ఇటువంటి చర్యలు తీసుకోవడం అప్రజాస్వామికమని ,రాజ్యాంగ విరుద్ధమని నిరసనకారులు మండిపడ్డారు. కాగా భారతదేశంలో ఎవరైనా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే  వారిని ఏమైనా చేస్తామని ప్రజల్లో భయం పుట్టించడానికే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని వారు ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో హాట్‌టాపిక్‌గా ఉన్న అదానీ వివాదాన్ని అణచిపెట్టాలనే కేంద్రం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని వారు కేంద్రంపై ధ్వజమెత్తారు.