Home Page SliderNews

సావర్కర్ గురించి ఇందిరా ఏం మాట్లాడిందో తెలుసుకో రాహుల్

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, అండమాన్ జైలులో రెండు జీవితకాల శిక్షలు అనుభవించిన ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ అని హోంమంత్రి అన్నారు. ఇలాంటి స్వాతంత్య్ర సమరయోధుడికి ఇలాంటి భాష ప్రయోగించి ఉండాల్సింది కాదన్నారు. వీర్ సావర్కర్‌పై తన నానమ్మ ఇందిరా గాంధీ ప్రసంగాన్ని రాహుల్ చదవాలన్నారు అమిత్ షా. సావర్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సొంత పార్టీ వారే రాహుల్ గాంధీకి సలహా ఇస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ భారీ మెజారిటీతో ప్రధాని అవుతారని.. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని షా అన్నారు. విపక్షాల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు.

అవినీతికి వ్యతిరేకంగా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని షా అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 1.10 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసిందని, ఇందులో రాజకీయ నేతలది ఐదు శాతం కూడా లేదన్నారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేద్దామా? నిందితుడు రాజకీయ నాయకుడు అయితే చర్యలు తీసుకోకూడదా అని షా ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఎవరు కేసులు పెట్టారని, షేక్ అబ్దుల్లాను అరెస్టు చేసేందుకు ఢిల్లీ నుంచి అధికారులతో కూడిన విమానాన్ని ఎవరు పంపించారని హోంమంత్రి ప్రశ్నించారు. కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం గురించి చరిత్ర ఒకసారి తెలుసుకోవాలన్నారు అమిత్ షా. 19 నెలల ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది అమాయకులను జైలులో పెట్టారని, ఆ రోజు ఆ పని ఎవరు చేశారని షా ప్రశ్నించారు. ఆ ఘటనకు కారణం రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ అని తెలియదా అని దెప్పిపొడిచారు.