Home Page SliderNational

ప్రధాని మోదీని కాదు,మోదీ కులాన్ని రాహుల్ అవమానించారు:అమిత్ షా

రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగంలో… మోదీని దూషించే మాటలు మాట్లాడలేదని… అతను మొత్తం మోదీ వర్గాన్ని, ఓబీసీ OBC సమాజాన్ని దూషించే మాటలు మాట్లాడాడన్నారు. దేశంలో చట్టం స్పష్టంగా ఉందని… బీజేపీకి ప్రతీకార రాజకీయాల ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. బంగ్లాను ఖాళీ చేయమని నోటీసు గురించి అడిగిన ప్రశ్నకు, శిక్ష అమలులోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పినప్పుడు… ఒకరి విషయంలోనే… ప్రత్యేక ఫేవర్ చేయాలా అని అమిత్ షా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకూడదనుకుంటే, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు షా. తాజాగా అనర్హత పడిన రాహుల్ మాత్రం మొదటివాడు కాడని… చాలా పెద్ద పదవులు అనుభవించిన రాజకీయ నాయకులు ఈ నిబంధన కారణంగా సభ్యత్వాలను కోల్పోయారన్నారు హోం మంత్రి. లాలూని అనర్హుడిగా ప్రకటించినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదని, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించినప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటూ ఆయన మండిపడ్డారు.

వ్యవహారం తన వరకు వచ్చింది కాబట్టే… గాంధీ కుటుంబానికి ప్రత్యేక చట్టం చేయాలని అంటున్నారని… ఒక్క కుటుంబానికి ప్రత్యేక చట్టం ఉండాలా అని ఈ దేశ ప్రజలను అడగాలనుకుంటున్నానన్నారు అమిత్ షా. ఇది ఎలాంటి మనస్తత్వమని ఆయన దుయ్యబట్టారు. మోదీని, లోక్‌సభ స్పీకర్‌ను నిందించడం మంచిపద్ధతేనా అని షా అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సీనియర్ న్యాయవాదులు అనర్హత వేటు విషయంలో… లోక్‌సభ స్పీకర్ పాత్ర లేదని సహచర పార్టీ నేతలకు చెప్పాలని షా అన్నారు. దోషిగా తేలిన క్షణం నుంచి పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాలన్నింటినీ రికార్డుల నుంచి తుడిచివేయాలన్నది చట్టం చెబుతోందని… కొద్దిరోజుల తర్వాత అనర్హత నోటీసును అందించినా పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో మార్పులను బీజేపీ కోరుకోవడం లేదని షా అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వును పక్కనబెట్టడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది… కానీ రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్సు కు అర్ధంలేనిదని మండిపడ్డారన్నారు. ఆ ఆర్డినెన్స్‌ను ఒకసారి రాహుల్ చించివేస్తే… దానిని చట్టంగా మార్చడానికి ఎవరూ సాహసించలేదన్నారు. ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారినట్లయితే, ఇవాళ రాహుల్ గాంధీ రక్షించబడేవాడన్నారు షా.