రాష్ట్రపతికి రాహుల్ గాంధీ లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దానిని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పశ్చమ బెంగాల్ టీచర్ల తొలగింపు విషయంలో అన్యాయం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పులో 25 వేల నియామకాలను రద్దు చేయడంపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నియామకాలలో మోసం జరిగిందని తేలినప్పటికీ, ఆ సంవత్సరంలో ఉద్యోగాలు పొందిన తప్పు చేయని ఉపాధ్యాయుల ఉద్యోగాలు కూడా పోవడం తీవ్ర అన్యాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. దాదాపుగా పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారి ఉద్యోగాలు పోవడం చాలా బాధాకరమని, విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమేనని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ద్రౌపది ముర్ము కూడా టీచర్‌గా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని, న్యాయంగా ఉద్యోగాలు పొందినవారిని తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

