Home Page SliderNational

రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగ ఉల్లంఘనే: శరద్ పవార్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. తాజా ఉదంతం… దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించడాన్ని చాటి చెప్తున్నాయన్నారు. శుక్రవారం జరిగిన పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన తర్వాత లక్షద్వీప్‌కు చెందిన తన పార్టీ ఎంపీ మహ్మద్ ఫైజల్ పీపీపై అనర్హత వేటు వేసిన విషయాన్ని కూడా ఎన్సీపీ అధినేత ప్రస్తావించారు. ఫైజల్‌పై విధించిన శిక్షను కేరళ హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. “కొన్ని నెలల క్రితం లోక్‌సభ ఎంపీలుగా ఉన్న రాహుల్ గాంధీ, ఫైజల్‌లపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం, ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయి. దీన్ని అందరూ ఖండించాలి. తాజా నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. ” అని పవార్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకోవడానికి అందరూ కలిసి నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.