రాహుల్ గాంధీది చైల్డిష్ మెంటాలిటీ-ఆజాద్ సూటి విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ నిర్వహణపై కీలక విమర్శలు చేశారు. రాహుల్ గాంధీది చైల్డిష్ బిహేవియర్ అంటూ రాజీనామా లేఖలో నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ అనుభవరాహిత్యంతో పార్టీలో సమస్యలు తలెత్తాయన్నారు. రాహుల్ తీరుతో కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక చర్చల ప్రక్రియ భూస్థాపితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని… పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మార్పులు అవసరమంటూ పార్టీ అధినాయకత్వానికి లేఖ రాసిన జీ-23 మంది నేతల్లో ఆజాద్ది కీలక పాత్ర… ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీ వీడి పక్కదారులు చూసుకుంటున్నారు. తాజాగా ఆజాద్ సైతం పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగింది. ఆరోగ్య సమస్యలతో సోనియా గాంధీ విదేశాలకు వెళ్తున్న తరుణంలో ఆజాద్ లేఖ పార్టీకి పెద్ద కుదుపు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ అస్తవ్యస్థంగా ఉంది. ఓవైపు ప్రాంతీయ పార్టీల దూకుడు, మరోవైపు బీజేపీ వ్యూహాత్మక అడుగులతో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటొంది.

దేశంలో రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో మాత్రమే హస్తం పార్టీ అధికారంలో కొనసాగుతోంది. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పతనమవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ గుడ్ బై చెప్పడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. కొత్త అధ్యక్ష ఎంపిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోడానికి విముఖత చూపడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను పార్టీ చీఫ్ బాధ్యతలు తీసుకోవాలని కోరినప్పటికీ ఆయన… అందుకు నిరాకరించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది.