Home Page SliderNational

రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్శిటీ నోటీసులు

ఢిల్లీ యూనివర్శిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పురుషుల హాస్టల్‌ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గత వారం ఆకస్మికంగా సందర్శించడంపై నోటీసులు అందుకున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుడి ఇలా గౌరవానికి మించిన పనులు చేయరాదని యూనివర్శిటీ అభిప్రాయపడింది. రాహుల్ గాంధీకి పంపిన రెండు పేజీల నోట్‌లో హాస్టల్ పర్యవేక్షించే ప్రోవోస్ట్ కెపి సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. రాహుల్ ఎలాంటి సమాచారం లేకుండా హాస్టల్‌కు రావడం, అతిక్రమణ, బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలను మానుకోవాలని యూనివర్శిటీ రాహుల్‌ను కోరింది. మూడు వాహనాలతో పాటు ప్రాంగణంలోకి రాహుల్ రాక ఆకస్మికంగా జరిగిందని, హాస్టల్ నిబంధనలను ఉల్లంఘించిందని ప్రోవోస్ట్ చెప్పాడు.

శుక్రవారం రాహుల్ గాంధీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని పోస్ట్-గ్రాడ్యుయేట్ పురుషుల హాస్టల్‌ను సందర్శించి, కొంతమంది విద్యార్థులతో సంభాషించారు, వారితో కలిసి భోజనం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్, ప్రొక్టర్ సమక్షంలో 06.05.2023న జరిగిన హాస్టల్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో Z కేటగిరి భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుడి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్‌కు రావడం మంచిది కాదని నోటీసులో పేర్కొన్నారు. నియమావళి ప్రకారం బయటి వ్యక్తులు ఎవరూ కూడా హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్, రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని నోటీసుల్లో యూనివర్శిటీ స్పష్టం చేసింది. అయితే రాహుల్ పై చర్యల కోసం ప్రభుత్వం నుంచి యూనివర్శిటీ యాజమాన్యంపై ఒత్తిడి ఉందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఆరోపించింది.