కవితకు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ప్రధాని మోడీపైనా, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవితకు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రస్తావనకు వచ్చిందని.. తప్పు చేస్తే శిక్షిస్తారని.. లేకుంటే వదిలేస్తారని… అనవసర వ్యాఖ్యలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వానికి విజయ్ నాయర్ అనే వ్యక్తి ద్వారా వంద కోట్లు ఇచ్చానని అమిత్ అరోరా చెప్పారని.. ఆ మొత్తం సౌత్ గ్రూప్ వచ్చినవేని విచారణలో తేలిందన్నారు. వంద కోట్లు రూపాయలను విజయ్ నాయర్ ద్వారా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చేర్చారని… ఆ డబ్బులతో పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిచిందన్నారు. సౌత్ గ్రూప్ ఒక రిజస్టర్డ్ కంపెనీ అని… ఆ కంపెనీ డైరెక్టర్ శరత్ రెడ్డి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారన్నారు. అదే కంపెనీలో కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారన్నారు.

మాగుంట లిక్కర్ వ్యాపారి అని.. ఆయనకు డిస్టిలరీ కంపెనీలున్నాయన్నారు. ఏళ్ల తరబడి ఆయన మద్యం వ్యాపారం చేస్తున్నారన్నారు రఘునందన్ రావు. శరత్ రెడ్డి ఫార్మాసూటికల్ కంపెనీ ఎండీకి అల్లుడని ఆయన మందులు తయారు చేస్తారన్నారు. ఈ ఇద్దరి మధ్యలో రాజకీయాలు చేసే కవిత ఎలా వచ్చారని ప్రశ్నించారు రఘునందన్. ఆ ఇద్దరితో కలిసి కంపెనీ ఎలా పెట్టారని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీలోని ఆప్ సర్కారుకు వంద కోట్లు వెళ్లాయన్న అభియోగంపై ఈడీ విచారిస్తోందన్నారు. కవిత 11 సెల్ ఫోన్లు పగులు గొట్టి నెంబర్లు మార్చారన్నారు. ఇప్పుడు జైల్లో పెడితే పెట్టుకొండని కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తోందనడం అవివేకమన్నారు. కవిత అసలు సౌతిండియా గ్రూప్ లో భాగస్వామి అవునో… కాదో చెప్పాలన్నారు. వంద కోట్లు ఇచ్చారో లేదో అన్నది విచారణలో తేలుతుందన్నారు. కవిత తప్పు చేశారు కాబట్టే ఈడీ వస్తోందని.. మోడీ కంటే ముందు ఈడీ వస్తోందనడం దారుణమన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా ఏడాది సమయం ఉందని… తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు.. ముందే భూజాలు ఎందుకు తడుముకుంటున్నారని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సంబంధం లేదని ఎస్టాబ్లిష్ చేసేందుకు కేసీఆర్ ముందుస్తు వ్యూహాలు పన్నారన్నారు. ముఖ్యమంత్రికుమార్తెను బీజేపీలోకి రమ్మని ఎవరైనా అడుగుతారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కవిత బీజేపీలోకి వెళ్లనందునే… కేసులు పెడుతున్నారని చెప్పేందుకు గ్రౌండ్ సిద్ధం చేశారని విమర్శించారు. ఈడీ విచారణ సందర్భంగా తప్పు చేయకుంటే వదిలిపెడుతుందని… తప్పు చేస్తే పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారన్నారు.

