Breaking Newshome page sliderHome Page SliderTelangana

కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని , పాలమూరు-రంగారెడ్డిపై పగబట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు .కేవలం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం ద్వారా 5 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా రైతులను దగా చేస్తోందని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్ అపర భగీరథుడిలా ప్రాజెక్టులు నిర్మిస్తే, నేటి పాలకులు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పెద్దల మెప్పు కోసం, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం “నదీజలాలు – కాంగ్రెస్ ద్రోహాలు” అంశంపై ఆయన సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి రంగానికి స్వర్ణయుగమైతే, ప్రస్తుత రేవంత్ సర్కార్ హయాం జలవిధ్వంసానికి వేదికైందని హరీశ్ దుయ్యబట్టారు.

తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రానికి శాపంగా మారాయని హరీశ్ రావు విమర్శించారు.అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని చెప్పిన మాటలను దాచిపెట్టి, సగం పేరాగ్రాఫ్ లే చదువుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం మాటలు “మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్లు” ఉన్నాయని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్, కేంద్ర మంత్రి సమక్షంలోనే కేసీఆర్ గట్టిగా ఎదిరించారని, ఆ చరిత్రను రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి నేటి వరకు తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని హరీష్ రావు స్పష్టం చేశారు. తాము రాజకీయాల కోసం ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే తమ ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ హయాం కంటే తమ ప్రభుత్వంలో ఏడు రెట్లు అధికంగా ఆయకట్టును సాగులోకి తెచ్చామని గణాంకాలతో వివరించారు. గోదావరి – బనకచర్ల విషయంలో జరిగిన లోపాయికారి ఒప్పందాలను ఎండగట్టిన ఆయన, తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.