InternationalNews Alert

భారతీయులపై జాత్యాహంకార దాడి

ఇటీవలి కాలంలో అగ్రరాజ్యమైన అమెరికా లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మా దేశం నుంచి వెళ్ళిపొండి అంటూ కొంతమంది ఏకంగా భారతీయులపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ భారతీయులను మానసికంగా కూడా వేధిస్తున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి . ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు భారతీయ అమెరికన్ల పై ఓ మహిళ జాతి పరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా అక్కడికి ఓ మహిళ వచ్చింది. మీ దేశానికి తిరిగి వెళ్ళిపొండి అంటూ దుర్భాషలాడటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వారిపై దాడిచేసి జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. నేను అమెరికా లో పుట్టాను.. ఇక ఇది నా దేశం.. మీరు అమెరికాలో పుట్టారా మీ దేశానికి వెళ్లిపోండి. నేను మిమ్మల్ని భారతీయులని.. ద్వేషిస్తున్నాను అంటూ అసభ్య పదజాలాన్ని కూడా వాడింది. ప్రస్తుతం ఈ దాడికి సంబధించిన వీడియో యూఎస్ లోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీ లో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వ్యక్తి ఈ సంఘటన గురించి వివరించారు. మా అమ్మ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళుతున్న సమయం లో మెక్సికన్ అమెరికన్ అయిన ఒక మహిళ అక్కడికి వచ్చి వారితో వాదించిందని…అయితే వారు జాత్యహంకార దూషణలు చేయొద్దని కోరినా కూడా ఆమె దారుణమైన పదజాలం తో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. ఒకనొక సమయంలో భారతీయులు నేను ఎక్కడికి వెళ్లినా కనిపిస్తున్నారు…ఇండియాలో జీవితం చాలా గొప్పగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ గట్టిగా అరుస్తూ మెక్సికన్-అమెరికన్ మహిళ నానా హంగామా చేసింది. ఆ మహిళపై దాడి, తీవ్రవాద బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదు చేసారు.