కాస్కో అమెరికా… ఇక అణుయుద్ధమే…!
రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు
అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
యూరప్, అమెరికాకు వార్నింగ్
ఉక్రెయిన్‌కు సాయంపై ఆగ్రహం
ఇది ఎంత మాత్రం కపటం కాదు…
ఉక్రెయిన్‌కు సాయంపై పుతిన్ దూకుడు
అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తా…
11% ఉక్రెయిన్ భూభాగం స్వాధీనం
ఉక్రెయిన్ దారిలోకి రాకుంటే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… రష్యా భూభాగాలను రక్షించడానికి 20 లక్షల మంది బలమైన సైన్యం ఉందన్న పుతిన్… హద్దు మీరితే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూరప్ దేశాలు రష్యా నాశనం కోరుకుంటున్నాయని… ఉక్రెయిన్‌లో శాంతిని కోరుకోవడం లేదని పుతిన్ ధ్వజమెత్తారు. రష్యాను కాపాడుకోడానికి అణ్వాయుధాలను ఉపయోగించేందుకైనా సిద్ధమంటూ తొలిసారిగా యూరప్ దేశాలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 దండయాత్ర తర్వాత పుతిన్ తొలిసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఏడు నెలలుగా సాగుతున్నా… ఎప్పుడూ అణ్వాయుధాల గురించి నేరుగా ప్రస్తావించని పుతిన్.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్లాక్ మెయిల్ చేస్తే అంతు చూస్తా…
యూరప్ దేశాలు అణ్వాయుధాలతో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాయని, రష్యా నాశనం కోరుకుంటున్నాయని… ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నాయని పుతిన్ మండిపడ్డారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకున్న… హంగేరీ పరిమాణంలో ఉన్న భూభాగాన్ని కలుపుకునే ప్రణాళికను పుతిన్ ఆమోదించారు. భద్రత కోసం 3 లక్షల రిజర్వ్ బలగాలను మోహరించేందుకు ఆమోదం తెలిపారు. రష్యా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగితే…దేశ ప్రజలను రక్షించడానికి నిస్సందేహంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. ఎవరినో బ్లఫ్ చేసే ఉద్దేశంలో మాట్లాడుతున్న మాటలు కావంటూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తేల్చి చెప్పారు. యూరప్ దేశాలు ఇప్పటి వరకు అన్ని లక్ష్మణ రేఖలను దాటాయని… అణ్వాయుధాలతో బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.

ఇప్పటి వరకు ఒక లెక్క… ఇకపై మరో లెక్క…
ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను రెట్టింపు చేస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం ద్వారా అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి… రష్యాతో అమీతుమీకి దిగుతోందని భావించాల్సి ఉంటుందని… తాజా పరిణామాలన్నీ మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తున్నాయన్నారు. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత ఉక్రెయిన్‌లో అంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమెరికా, యూరప్ దేశాల కుట్రల వల్ల ప్రపంచమంతా ప్రమాదంలోకి నెట్టబడిందన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా… ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న పశ్చిమ దేశాల సైనిక పాటవంతో పోరాడేందుకు పుతిన్ సైన్యానికి పూర్తి అధికారాలు అప్పగించారు. అందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం కూడా చేశారు. యూరప్ దేశాల జిత్తులను చిత్తు చేస్తామన్నారు.

ఉక్రెయిన్ యుద్ధభూమికి 3 లక్షల సైన్యం
పుతిన్ మాట్లాడిన కొద్దిసేపటికే రష్యా రక్షణ మంత్రి సెర్గీ కీలక ప్రకటన చేశారు. 3 లక్షల మంది యోధులు ఉక్రెయిన్ భూభాగంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రష్యాపై అణ్వాయుధాలను సమర్ధవంతంగా ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు NATO దేశాలలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు పుతిన్. రష్యా నియంత్రణలో ఉన్న జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్‌ను అనుమతించడం ద్వారా పాశ్చాత్య దేశాలు అణుయుద్ధానికి కాలుదువ్వుతున్నాయన్నారు. రష్యా దళాలచే నియంత్రించబడే ఉక్రెయిన్‌లో రాబోయే రోజుల్లో జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు పుతిన్ స్పష్టమైన మద్దతిచ్చారు. హంగేరీ పరిమాణంలో ఉన్న ఉక్రెయిన్ భాగాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకోవడానికి రష్యా సిద్ధమవుతోంది.

అణు వార్ హెడ్లతో యుద్ధానికి రష్యా సై…
ఉక్రెయిన్‌పై దండయాత్రకు ముందు పుతిన్ స్వతంత్రంగా గుర్తించిన డోంటెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా గుర్తించింది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాలలో రష్యా ప్రజాభిప్రాయసేకరణ జరపనుంది. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖెర్సన్లలోని మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అందుకు తాము మద్దతిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. మా ఆధీనంలో ఉన్న ప్రజలను అంతం చేసేవారికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమన్నారు పుతిన్. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 15 శాతం అధికారిక విలీనానికి రష్యా మార్గం సుగమం చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రణాళికను చట్టవిరుద్ధమైన బూటకమంటూ యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా కంటే ఎక్కువ వార్ హెడ్లను కలిగి ఉన్న రష్యా… మొత్తం వ్యవహారంలో అగ్రరాజ్యానికి దీటుగా జవాబివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రష్యా భద్రతకు ప్రమాదకర పరిణామాలు తలెత్తినప్పుడు అణ్వాయుధాలను వాడేందుకు ఆ దేశానికి అవకాశం ఉంది.
