రూ.30 వేలు పెట్టి ఇంట్లో మీటర్లు పెట్టుకోవాలంట..
వ్యవసాయ మోటార్లే కాదు.. ఇంట్లోనూ రూ.30 వేలు పెట్టి కరెంటు మీటర్లు పెట్టుకోవాలని ప్రధాని మోదీ ఒత్తిడి చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాంగంగా ఆయన ఆదివారం చండూరు సభలో మాట్లాడారు. ‘మన దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ.. 2.1 లక్షల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మన తెలంగాణాలో తప్పితే ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదు. విద్యుత్తు సంస్కరణల పేరుతో మన కరెంటుకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. బాయికాడి మోటార్లే కాదు.. మన ఇండ్లలోనూ కొత్త మీటర్లు పెట్టుకోవాలంట. 30 వేల రూపాయలు ఇచ్చి కొత్త మీటర్లు కొనాలంటున్నరు. మీటర్లు పెట్టుకొని మన కొంపలు ఆర్పుకుందామా..? మీటర్లు పెట్టాలంటున్న వాళ్లకే మీటరు పెడ్దామా..? బీజేపీకి ఓటేస్తే మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నట్లే. బీజేపీ వాళ్లకు డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెట్టేస్తారు. ఆశ పడితే గోస పడ్తాం. 60 ఏండ్ల కింద చిన్న పొరపాటు చేసినందుకు ప్రత్యేక తెలంగాణ కోసం 58 ఏళ్లు కొట్లాడినం. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయిండ్రు. నేను కూడా చావు నోట్లో తలపెట్టి కొట్లాడిన. వచ్చిన తెలంగాణాను కాపాడుకునేందుకు కష్టపడదాం. ఆలోచించి ఓటేయకుంటే నట్టేట మునుగుతం’ అని కేసీఆర్ హెచ్చరించారు.