NationalNews

పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ ఇల్లు ముట్టడి

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సొంత రాష్ట్రంలో రైతులు చుక్కలు చూపించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. భగవంత్ మాన్ ఇంటి వెలుపల ఇవాళ భారీ నిరసన జరిగింది. వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనలను అదుపులోకి తెచ్చారు. నినాదాలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. రాష్ట్ర ప్రభుత్వం MNREGA (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద రోజువారీ వేతనం ₹ 700 కి పెంచాలని, 5 మరల భూమి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సహకార సంఘాల్లో దళితులకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని, భూసేకరణకు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. చర్మవ్యాధితో పశువులు చనిపోవడం వల్ల నష్టపోతున్న రైతులకు ఉపశమనం కలిగించాలని… పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని నిరసనకారులు పట్టుబట్టారు.

పాటియాలా బైపాస్ వద్ద గుమిగూడిన ఆందోళనకారులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటివైపు ర్యాలీగా వచ్చారు. ముఖ్యమంత్రి అద్దె నివాసం ఉన్న రెసిడెన్షియల్‌ సొసైటీ సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్టోబరులో 19 రోజులపాటు నిరసన తెలిపిన రైతులు డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించిన తర్వాత ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వానికి నొప్పేంటని కార్మికులు మండిపడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రచారంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

ఐతే నిరసనలకు బీజేపీ మద్దతు పలుకుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. గుజరాత్‌లో భగవంత్ మాన్ ప్రచారాన్ని అడ్డుకోవాలని ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో బీజేపీ బలపడటానికి ఇలా చేస్తోందని ఆ పార్టీ పేర్కొంది. కానీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. కాలయాపన చేయడం దారుణమని బీజేపీ విమర్శించింది. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనమవుతున్న తరుణంలో పంజాబ్‌లో ఎస్సీ, ఎస్టీలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఆప్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో దళితులకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.