పులివెందుల పంచాయితీ… వివేక హత్యపై అత్తా కోడలి సమరం…
వైఎస్ వివేక హత్యకు సంబంధించి, షర్మిల చేస్తున్న ఆరోపణలపై ఆయన సోదరి వైఎస్ విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ ఇంటి ఆడపడుచులు కుటుంబ గౌరవాన్ని రోడ్డుపై పడేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కుటుంబ ఆడబిడ్డగా భరించలేక మీడియా ముందుకు వచ్చానన్నారు. షర్మిల కొంగుబట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, రాజకీయాల్లో సెంటిమెంట్, కొంగులుబట్టుకొని గెలవగలిగితే.. ఇక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కడున్నాయన్నారు. మాటకు ముందు వైఎస్సార్ కుమార్తెనని చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించారు. వివేకను అవినాష్ హత్య చేసింది చూశారా అని ప్రశ్నించారు. హత్య చేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని… వాడు చెప్పిన మాటలు విని, కుటుంబ పరువును బజారుకీడుస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. అవినాష్ కూడా తమ ఇంట్లో బిడ్డేనన్న ఆమె… షర్మిల, సునీత, అవినాష్ జీవితాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడని… అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారని మండిపడ్డారు. సొంత అన్ననను శత్రువులంతా ఒక్కటై ఎటాక్ చేస్తుంటే.. సమర్థించాల్సింది పోయి… వారితో చేతులు కలిపారని… ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. షర్మిల మాట్లాడే వీడియోలు చూస్తుంటే బీపీ పెరుగుతోందన్నారు. ఇంట్లో వాళ్లందరూ ఏడుస్తున్నారన్నారు. జగన్‌పై పర్సనల్ గా కక్షపెట్టుకున్నారని… కార్యకర్తలు కొట్టుకునేలా పరిస్థితులు తీసుకొస్తున్నారన్నారు. ఇకనైనా అక్కచెల్లెల్లు నోరు మూసుకోవాలని హెచ్చరించారు.

జగన్ హయాంలో పేదలు సంతోషపడుతుంటే… అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైనంత మాత్రాన నువ్వు చేసినదంతా కరెక్ట్ అనుకోవద్దని హితవు పలికారు. ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ శత్రువులతో కలిసి తిరుగుతున్నావన్నా ఆమె… అక్కా, చెల్లెళ్లకు కళ్లూ, చెవులు మూసుకుపోయాయన్నారు. వివేక, కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లే, జగన్ అవినాష్‌కు మద్దతిచ్చాడన్నారు. ఎన్ని విమర్శలు చేసినా… అవినాష్ మిమ్మల్ని ఒక్క మాట అనలేదన్న ఆమె, అక్కల కోసం ప్రార్థం చేస్తున్నాడని ఆమె చెచ్పారు. దేవుడంటే భయభక్తులు లేకుండా పోయాయన్నారు. ఈడీ కేసులు కొలిక్కి వస్తే, ఆస్తుల పంచిస్తానని జగన్ చెప్పారని… కానీ ఆమె ఎందుకో పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్నట్టు కన్పిస్తుందన్నారు. షర్మిలను భరించలేక, విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయిందన్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు, శత్రువుల చేతిలో కీలుబొమ్మలయ్యారన్నారు. జగన్ సీఎం అయ్యాక కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కావొద్దన్నారని… పనులు కాలేదని కోపం పెట్టుకున్నారన్నారు.

తనపై విమర్శలు చేసిన అత్త విమాలా రెడ్డికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు షర్మిల. ఆమె ఎందుకలా మాట్లాడిందో అర్థం కాలేదన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేకనో, లేదంటే వయసు మీదపడటం వల్లనో అలా మాట్లాడరంటూ సెటైర్ వేశారు. తాను ఆధారాల్లేకుండా మాట్లాడటం లేదన్న షర్మిల… విమలమ్మ మేనత్తేనన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో తాము ఆధారాల్లేకుండా మాట్లాడటం లేదన్నారు. సీబీఐ చెప్తున్న ఆధారాలను ఎత్తి చూపుతున్నాన్నారు. ఆధారాలుండబట్టే తమకు విషయం తెలిసిందన్నారు. అందుకే తాము కేసు విషయం మాట్లాడుతున్నామన్నారు. మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదని… హత్యారాజకీయాలు ఆగాలనే తాము కొట్లాడుతున్నామన్నారు. ఇక విమలమ్మ జగన్ కు మద్దతుగా నిలవడానికి ఇవే కారణాలంటూ కూడా షర్మిల కొన్ని విషయాలు చెప్పారు. విమలమ్మ కొడుక్కి, జగన్మోహన్ రెడ్డి పనులివ్వడంతో ఆర్థికంగా బలపడ్డారన్నారు.

అందువల్లే విమలమ్మ బయటకు వచ్చి ఇలా మట్లాడుతున్నారన్నారు. చనిపోయిన అన్న వివేకానంద రెడ్డి ఎంతో చేశారో ఆమె మరచిపోయారన్నారు. పెద్ద వయసు కావడంతో మరచిపోవడం సహజమేనన్నారు. అందులో ఎండా కాలం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు షర్మిల. అందుకే కడప నుంచి మార్చాలని వైసీపీ చూస్తుందన్నారు. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్ నమ్మినట్టే కదా అని అన్నారు. వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారన్నారు. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? అంటూ ఆమె ప్రశ్నించారు.

