ప్రజాపాలన అంటే.. మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేయడమేనా..?
పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ తెలంగాణలో మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్లో సమావేశమయ్యారు. అనంతరం హోటల్ బయటకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ లను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. సీఎం కలిసేందుకు వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారు.. కానీ సర్పంచ్ ల బిల్లులు చెల్లించరా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఊరికి బాగు చేసిన వారికి అరెస్టులు చేయడమేనా? అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మాజీ సర్పంచ్ ల బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.