రైలు పట్టాలపై పబ్ జీ గేమ్.. గాలిలో కలిసిన టీనేజర్ల ప్రాణాలు
బీహార్ రాష్ట్రంలో ఓ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్ జీ గేమ్ ఆడుతున్నారు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంలో రైలు వస్తున్న సంగతిని వారు గుర్తించలేకపోయారు. దాంతో వేగంగా వచ్చిన ట్రైన్ వారిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్ పూర్ రైలు సెక్షన్ లోని మాన్సా తోలాలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.