Andhra PradeshHome Page Slider

సైకో అంటే ఏమో అనుకున్నా… జగన్‌పై జనసేన నేత నాదెండ్ల ఫైర్

సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం ఇప్పటంలో ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జనసేన సభకు సహకరించారన్న అక్కసుతో… స్థానిక ఎమ్మెల్యేకు ఎదురొడ్డి నిలిచిన గ్రామస్తులపై కక్ష పెంచుకున్నారని విమర్శించారాయన. అన్యాయంగా ఇళ్లను కూలగొడుతున్నారని దుయ్యబట్టారు. దమ్ము గురించి పదేపదే చెప్పే ముఖ్యమంత్రి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎందుకు కూల్చివేతలు చేయలేదని ప్రశ్నించారు. శని, ఆదివారం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన చేసే జ్ఞానంలేక ఇలాంటి పనులు చేస్తారా అని నిప్పులు చెరిగారు. 4 వేల మంది రైతులు ఉండే చిన్న గ్రామంలో 80 అడుగుల రోడ్డు ఉంటే 120 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు వేస్తారా అంటూ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది పోలీసులతో… రోడ్లను మూసేసి అరాచకం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా మంది సైకో సైకో అంటుంటే ఏమో అనుకున్నాన్నా నాదెండ్ల మనోహర్… కానీ ఇవాళ నిజమైందన్నారు. ప్రజలను హింసించి.. వేటాడి ఇబ్బంది పెడుతున్నారన్నారు.

(file photos)

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు పవన్ కల్యాణ్ మద్దతిచ్చిన 24 గంటల్లోనే ఇలాంటి చర్యలేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం జగన్ యుద్ధం మీరు మొదలుపెట్టారు. వచ్చే రోజుల్లో జనసేన ప్రభుత్వం వస్తుందని.. అన్నింటికీ బదులు తీర్చుకుంటామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు 40 అడుగుల రోడ్లున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆనందం కోసం.. ప్రజలను హింసిస్తారా అంటూ మండిపడ్డారు. పచ్చటి గ్రామాల్లో మంటలు పెడుతున్నారన్నారు. గ్రామంలో రోడ్డు లేదని.. కానీ రైతులపై కక్షగట్టి… గ్రామం మధ్యలో 120 అడుగుల రోడ్డు వేస్తారా అంటూ ఆక్షేపించారు. కూల్చివేతలు తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే సోమవారం, మంగళవారం చేయాలని.. కోర్టుకు వెళ్లకుండా ఉంటారనే శనివారం చేస్తున్నారన్నారు. ఇప్పటం ప్రజలను ఏడాది నుంచి ఇబ్బంది పెడుతున్నారన్నారు. మార్చి 14న మచిలీపట్నంలో సభ నిర్వహిస్తున్నామనే ఇప్పుడిలా చేస్తున్నారన్నారు. మచిలీపట్నంలో జనసేన సభ కోసం రైతులు 34 ఎకరాలిచ్చారన్నారు మనోహర్. అక్కడి ప్రజలను బయటపెట్టడానికే ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటం గ్రామస్తులకు జనసేన సంఘీబావం తెలుపుతుందన్నారు. మార్చి 14న జరగబోయే జనసేన పదో ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ సర్కారుకు చంపపెట్టులా ఉంటుందన్నారు.