అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్లెక్కారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 1400 ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగాలు, మాంద్యం భయాలు, వలస విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు అంచనా. ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై అగ్రరాజ్యలో భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛలను హరించడం సహా ఇతర అంశాలపై ట్రంప్ తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేల మంది నిరసనకారులు వాషింగ్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో మరియు లాస్ ఏంజిల్స్ లతో పాటు ఇతర ప్రదేశాలలో ర్యాలీ చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులుగా లక్షలాది మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌరహక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్ జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు ఉన్నారు.

