నమోదు చేసుకున్నా అందని సురక్ష
రంపచోడవరం: రంపచోడవరం మండలం వేములకొండ పంచాయతీ పరిధి కాకవాడ ఆశ్రమ పాఠశాలలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రోగులకు వైద్య సేవలందించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వైద్యులతోపాటు సిబ్బంది వెళ్లిపోయారు. అయితే 150 మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రోగులకు వైద్యం అందకుండా పోయింది. రోగులకు వైద్యం అందించకుండా సిబ్బంది వెళ్లిపోవడమేంటని అధికార పార్టీకి చెందిన వేములకొండ సర్పంచ్ కొమరం పండుదొర, ఎంపీటీసీ సభ్యులు నర్రి పాపారావు, వార్డు సభ్యులు పూసం వెంకటలక్ష్మి, సెక్రటేరియట్ కన్వీనర్ సాదల మంగిరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పండుదొర, పాపారావు చెప్పారు.

