“మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యం”: మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ రోజు జిల్లా DRDO అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు సీతక్క తెలిపారు. మహిళా ఉన్నతి తోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందన్నారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ లో జిల్లా DRDO, అదనపు DRDO తో మహిళా శక్తి రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారిపై పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓ కాత్యాయని తో కలిసి మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నమన్నారు. డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళల సంఘాలకు ప్రోత్సహిస్తున్నమని తెలిపారు.క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాదించగలమన్నారు. ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

