మోదీ మణిపుర్ పర్యటనపై ప్రియాంక సెటైర్లు
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న మోదీ మిజోరం రాజధాని ఐజ్వాల్ కేంద్రంగా రూ.8,071 కోట్లతో కొత్తగా నిర్మించిన 51.38 కి.మీ. పొడవైన రైలు కారిడార్‌ను ప్రారంభించారు. మోదీ పర్యటన దృష్ట్యా మణిపుర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపుర్ లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ మోదీపై సెటైర్లు వేశారు. మణిపుర్ లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్ లోని గత ప్రధానమంత్రులు ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు వెంటనే అక్కడికి వెళ్తేవారన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అందరు ప్రధానులు ఇదే పాటించారని తెలిపారు. మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. కానీ, మోదీ మాత్రం రెండేళ్ల తర్వాత మణిపూర్ కి వెళ్లడాన్ని ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికే అక్కడ పర్యటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

