ప్రియాంక సభలో బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌కు భారీగా వలసలు
తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకీ బలపడుతోంది. ఈ నెల 20న కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనేక మంది జాతీయ కాంగ్రెస్ నేతలు సహా ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు. ఈ సభలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు ఉంటాయని, తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అనేక మంది కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. ఈ సందర్భంలో నేడు జూపల్లి, భట్టివిక్రమార్క ఇంటికి చేరుకుని చర్చలు జరుపుతున్నారు.

మరోపక్క నాగర్ కర్నూలు నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కుమారుడు డాక్టర్ రాజేశ్ రెడ్డితో సహా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని భట్టి తెలియజేశారు. 14 నియోజక వర్గాల నుండి కూడా అనేక మంది బీఆర్‌ఎస్ నుండి రాజీనామా చేసిన వ్యక్తులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలియజేశారు. తెలంగాణ లక్ష్యాలు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యపడుతుందని, ప్రజలు, కార్యకర్తలు ఈ సభను విజయవంతం చేయాలంటూ ఆహ్వానించారు భట్టి విక్రమార్క.