కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచార ఘటనతో ప్రిన్సిపాల్ నిర్ణయం
కోల్‌కత్తాలో ఆర్‌జీ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపై దేశవ్యాప్తంగా వైద్యవిద్యార్థులు నిరసనలు పాటిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీనితో ఆర్‌జీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన తర్వాత మృతురాలిపై ఆయన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ వార్తలు వచ్చాయి. దీనితో మనస్తాపం చెందిన ఆయన పదవి నుండి వైదొలగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాజిక మీడియాలలో తనపై అవమానకరంగా మాట్లాడుతున్నారని, తాను నిందితునికి శిక్ష పడాలనే కోరుకున్నానని పేర్కొన్నారు. మృతి చెందిన అమ్మాయి కూడా తనకు కుమార్తె వంటిదేన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను అన్నారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తనను రెచ్చగొట్టేలా కొందరు విద్యార్థులు మాట్లాడారని పేర్కొన్నారు. పీజీ మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్న వైద్యవిద్యార్థిని గురువారం విధుల్లో ఉండగా, శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో మృతిచెంది కనిపించారు. ఆమె శరీరభాగాలపై గాయాలు, రక్తస్రావం కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిపి హత్యచేసినట్లు పోలీసులు నిర్థారించారు. నిందితుడిని అరెస్టు చేశారు. 3 రోజులుగా విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థినులకు రక్షణ కల్పించకుంటే విధులకు హాజరు అయ్యేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యసేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నాట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది.


 
							 
							